చ‌లం ఫౌండేష‌న్ ప్ర‌చుర‌ణ‌

ఆన్‌లైన్‌లో ఊర్వ‌శి చ‌ద‌వండి

'ఊర్వశి' అనే ఒక స్త్రీ పాత్ర  ఎన్నో సాహితీ ప్రక్రియల లో,
అనేక మంది రచయితల హృదయాకాశవీధిలో రూపు కట్టి, పలుమార్లు వ్రాయబడింది,
అని నిరూపించే విశిష్టమైన పుస్తకమిది.

Urvasi
Sakshi Telugu Daily

ఊర్వశి ------ ఒక పునర్మూల్యాంకనం

చలం ఫౌండేషన్, వైజాగ్ వారు శ్రీ పచ్చిపులుసు వెంకటేశ్వర్లు గారి 'ఊర్వశి' అనే పుస్తకాన్ని ద్వితీయ ప్రచురణగా విడుదల చేశారు. దీని ప్రథమ ముద్రణ 1992లో ఎం శేషాచలం అండ్ కంపెనీ, ఏలూరు రోడ్డు, విజయవాడ వారి నుంచి వచ్చింది.వివిధ భారతీయ భాషలలో, 'ఊర్వశి' పాత్రచిత్రణ గురించి ఈ పుస్తకం వ్రాయడానికి ఉపకరించిన గ్రంధాలే సుమారు  26 ఉన్నాయి.        
శ్రీమద్రామాయణం ను పలు రచయితలు అనేక మార్పు, చేర్పులతో వ్రాసారని మనందరికీ తెలుసు. అందులోని సంఘటనలను ఒక్కొక్క రచయిత ఒక్కొక్కలా వివరించి,వర్ణించి , ఊహించి, మార్చి , వ్రాసారు.
అయితే 'ఊర్వశి' అనే ఒక స్త్రీ పాత్ర కూడా ఎన్నో  సాహితీ ప్రక్రియల లో, అనేక మంది రచయితల హృదయాకాశవీధిలో రూపు కట్టి, పలుమార్లు వ్రాయబడింది,  అని నిరూపించే విశిష్టమైన పుస్తకమిది.
ముఖచిత్రం పైననే ఊర్వశి రూపం అద్భుతమైన నాట్య భంగిమలో విలాసంగా ,  తన్మయత్వం తో కళ్లు మూసుకుని మరీ కనబడుతుంది .ఎర్రని ఎరుపుకు, పసుపు రంగు అలదిన పట్టు వస్త్రం తో ఆ చలనశీలి మూర్తి లో ఒక గొప్పతనం ఉంది. అదేమిటంటే ఆ నర్తకీమణి ఊర్ధ్వ ముఖంగా ఉంచిన పాదం.ఇది చాలా అరుదైన భంగిమ.పరమశివుడు, పార్వతీ దేవి నడుమ మహాశివుడు నటరాజై  తాండవం చేస్తూ వెలార్చిన భంగిమ కు ధీటుగా ఉంది.
రచయిత శ్రీ పచ్చి పులుసు వేంకటేశ్వర్లు గారు అత్యధికంగా ప్రేరణ పొందిన వృత్తాంతం చలంగారి 'ఊర్వశి' కాబోలు ,అందుకే చలం గారిని ముఖచిత్రం పై నిలిపారు.
శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ,,శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, శ్రీ నాగభైరవ కోటేశ్వరరావు, డాక్టర్ సి.నారాయణరెడ్డి గార్లు వ్రాసిన ముందు మాటలు విశిష్టమైనవి. ఇవి, ఇంత గొప్ప పుస్తకాన్ని చదివేటప్పుడు కావలసిన  ఊహ, విశ్లేషణ, వర్ణన అనే మూడింటి ని పాఠకునికి అందించి, సమాయత్త పరుస్తాయి.

ఇంతకూ ఊర్వశి ఎవరు?
బదరికారణ్యం లో తపస్సు చేసుకుంటున్న నారాయణ మహర్షి ఊరు భాగం నుంచి స్వర్గలోకపు అప్సరస లకు పోటీగా సృష్టింపబడిన స్త్రీమూర్తి యే  ఊర్వశి. కానైతే,  ఊర్వశి కథ తరతరాలుగా సుమారు 5 వేల సంవత్సరాలపాటు,  భారతదేశ సాహిత్యంలోని ప్రముఖ సాహితీ మూర్తులను ప్రభావితం చేసిన కల్పన.
స్థూలంగా ఊర్వశి కథలో ఆరు భాగాలున్నాయి.
అవి ఏమిటంటే,
1. పురూరవుని తో  వలపు లో పడడం.
2. వారి అనుబంధానికి నిబంధనలు
3. నిబంధనల అతిక్రమణ 
4. విరహంతో పురూరవుడు పడే ఆవేశం,అతడి  అన్వేషణ
5. ఊర్వశి పురూరవు ల సంవాదం : స్త్రీ మానసిక విశ్లేషణ 
6. పురూరవ ఊర్వశి పునః సంధానం.
ఊర్వశి పురూరవుల కథ ఋగ్వేదం నుంచి, పురాణాలలో, కథాసరిత్సాగరం లో, కాళిదాసు నాటకాలుగా, రవీంద్ర అరవిందుల కావ్యాల్లో, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వం లో  , వర్ణింప బడితే ఒక్క గుడిపాటి వెంకట చలం గారు మాత్రం పురూరవుని కథ గా  దీనిని రాశారు. చలం గారి ఊహలో ఊర్వశి 'ముక్తి కాంత' .
వీటిని సమీక్షించి చూద్దాం.

ఋగ్వేదం
ఇందులో  ఊర్వశి స్వర్గలోకంలో ని అప్సరస. ఆమె పురూరవుని తానుగా వలచి వచ్చినట్లుగా , గర్భం ధరించాక  అతడిని వీడి వెళ్ళిపోతే  విరహ తప్త హృదయుడైన పురూరవుని, ఊరడించి, "నీవుమృత్యుంజయుుడవు ఔతావ"ని ఊర్వశి దీవించిన వైనం మనోహర సంభాషణ రూపంలో నడపబడింది.ఈ కథలో నాటకీయత, విప్రలంభ శృంగారముు, వేదన ఆపాదించబడినాయి.

 'శతపధ బ్రాహ్మణం' : 
ఇక్కడ  ఊర్వశి పురూరవులను విడదీయుట కు గంధర్వులే ఒక పన్నాగం పన్నినట్లుగా కథ  కొత్త పుంతలు తొక్కింది. చివరకు గంధర్వులే పురూరవుని కూడా తమ లోకంలోకి వచ్చేటట్లు అనుగ్రహించినట్టు  ఋగ్వేదంలో కన్న విపులంగా వ్రాయబడి,  పురూరవునికి ఊర్వశి  ప్రాప్తించడం తో సుఖాంతమైన నాటకంగా భాసించింది.

మత్స్య (పద్మ) పురాణం: 
ఇందులోనూ ఊర్వశి ప్రస్తావన ఉంది. ఇదియే కాళిదాసు 'విక్రమోర్వశీయం' కు మూలం . ఇందులో కథ చాలా చాతుర్యంతో మలచబడిి , పురూరవుడు ధార్మికుడు, పరాక్రమవంతుడుు, సర్వలోక నమస్కృతుడు అందుకే ఇంద్రుని అర్థ సింహాసనం లభించిన వాడు గా చిత్రించబడింది.
ధర్మార్థ కామాల లో ధర్మాన్ని ఎక్కువగా ఆచరించటం వల్ల అర్థ,కామాలకు కోపం వచ్చి, లోభం వ్యామోహం లకు  చిక్కి, పురూరవుడు పతనమౌతాడని వారు   శపిస్తారట. ఐతే ధర్మం పురూరవుని 'చిరాయువౌతావ'ని ఆశీర్వదించినట్టు గా కథ. చివరకు ఊర్వశి పురూరవులు  చిరకాలం జీవితం గడిపినట్లుగానూ, ఎనిమిది మంది కుమారులను పొందినట్లుగా వ్రాయబడింది.

విష్ణుపురాణంలో:
శతపథ బ్రాహ్మణంలోని కథే  చిన్న మార్పులతో విపులీకరించబడింది.

సంస్కృతంలోని శ్రీమద్భాగవతం:
ఇందులో పరీక్షిన్మహారాజుకు చంద్రవంశం  గురించి వర్ణిించినప్పుడు ఈ కథ  చెప్పబడింది. ఊర్వశి వియోగంతో వేదన పడుతున్న పురూరవునికి,  ఊర్వశే సాక్షాత్కరించి,  స్త్రీ స్వభావాన్ని విశదీకరిస్తూ....

"స్త్రీలు నిర్దయలు, స్నేహ పాత్రుళ్ళు కారు, చిన్న మాటకే విసుక్కుంటారు, స్వార్థం కోసం విశ్వాసం చూపిన భర్తను; తన సోదరుని, కూడా హత్య చేసేందుకు పాల్పడుతారు.వారి హృదయాల్లో సౌహార్దం ఉండనే ఉండదు, నూతన పురుషుడిపై కోరికతో  స్వచ్ఛంద జారిణులు  అవుతారు", అంటూ అత్యంత నిందాపూర్వకంగా స్త్రీ స్వభావం గురించి చెప్పడం జరిగింది.
ఈ వైఖరి మరెక్కడా కనబడదు. బహుశా ఆనాటి మను స్మృతి ఇలా రాయించింది అనుకోవాలి.

దేవీభాగవతం: 
ఇక్కడ కూడా ఇంచుమించు కథ లో మార్పులు లేవు
స్కంద పురాణం: కథలో భేదం లేదు

 బృహత్కథా మంజరిి : 
ఇందులో  కథ కొద్దిగా మార్చబడింది. ఉదయనుడు తన విరహ ప్రసంగంలో ఈ కథను ప్రస్తావించినట్లు గా చెప్పబడింది. ఊర్వశి పురూరవుల  పరస్పర ప్రేమ మనోరంజకంగా వర్ణించబడింది.పురూరవుడు  ఊర్వశి సహవాసం తోనే తనకు స్త్రీ సహజమైన అనేక భావాల పరమోత్కృష్ట స్థితి తెలిసినది అని మరొక 
అప్సర రంభ తో అంటూ,  ఊర్వశి ముందు రంభ ఆమె గురువు తుంబురుడు కూడా సరిపోదు  అని అన్నట్టు కథలో ఒక మలుపు సృష్టించబడింది. ఆపై తుంబురుని శాపం, ఊర్వశి వియోగం, వారిరువురూ  వియోగ భారాన్ని భరించడం, పురూరవుడు తపస్సు చేసి విష్ణువును ఆరాధించి తిరిగి ఊర్వశిని పొందడం జోడించబడ్డాయి.

కథాసరిత్సాగరం : 
ఇందులో ఊర్వశి మదనుని  రెండవ అస్త్రం 'సమ్మోహనం' గా వర్ణించారు.ఆమె లావణ్య రసో వారాశి . ఊర్వశి పురూరవుని తో కలసి వెళ్ళినప్పుడు స్వర్గం నిర్జీవమైందట!

 విక్రమోర్వశీయం: 
"కాళిదాసు కంటి కొసల పసిడి కలల పూలమాల ఊర్వశి", అని శ్రీ పచ్చిపులుసు వెంకటేశ్వర్లు గారు వర్ణించారు. 
ఊర్వశి లావణ్యం గురించి కాళిదాసు వ్రాస్తూ నారాయణుడి వంటి ఒక ఒక తాపసి సృష్టి  ఊర్వశి కానేరదు!"చలువ వెలుగుల రెల్లి దొర చంద్రుడో, ఆమని పూల స్వామియో,వలపుల రేడో ఈ  లలనను భావావేశంతో సృష్టించి ఉండాలి!" అని వ్రాశాడట! ఈ ఊహే పోను పోను భారతీయ ఆధునిక కవులకు నూతన సృజనా శక్తికి ఊతమిచ్చింది అనవచ్చు.

ఇంకా ప్రముఖ తత్వవేత్త అరవింద్ ఘోష్ గారు:
ఈయన పురాణ పాత్ర  'సావిత్రి' ని  గురించిన అతి దీర్ఘ కావ్యం ఆంగ్లంలో రచించి భారతీయ తత్వాన్ని పరిపుష్టం చేసిన గొప్ప రచయితగా పేరు పొందారు.ఆయన ఊహలలో కూడా 'ఊర్వశి' కదులాడింది. కవిగా ఆయన ఊర్వశి ప్రణయాన్ని దివ్యత్వ సాధన సోపానంగా మలిచారు. అయితే సత్వ సాధన మామూలు మనుషులకు అందేటట్లు గా విపులీకరించారు.
బాధాతప్త హృదయంతో  దుఃఖిస్తున్న పురూరవునకు, సముద్రం లోంచి 'ఇందిరా దేవి' అనే దేవత దర్శనం ఇచ్చిందనీ, ఆమె పురూరవుని ప్రేమను ప్రశంసిస్తూ 'నీది అతిలోక ప్రేమ'అనియూ, దేవ మానవ సమాగమమే మానవునికి అమృతత్వ సిద్ధిని కలుగజేస్తుందని, మళ్లీ పురూరవుడు ఊర్వశిని సాధించాలంటే అతనిలో దైవత్వం  నింపు కోవాలని బోధించినట్లు గా వర్ణించారు. ఈ విధంగా దైవత్వాన్ని ప్రేమ ద్వారా సాధించవచ్చు అనే తత్వాన్ని అరవిందులు ప్రసాదించారు .
ఈ వ్యాసం లో శ్రీ పచ్చి పులుసు వెంకటేశ్వర్లు గారు అరవిందుల గురించి వ్రాసిన వాక్యాలు చాలా ఆకట్టుకుంటాయి. " శ్రీ అరవిందులు ఒక సాహిత్య సర్వస్వం.వారి జ్ఞానం అపార పారావారం. ధీ పటిమ అనంత ఆకాశం. వారు సృష్టించిన సారస్వతం గంభీరం. ఆలోచనామృతం. అరవిందుని సావిత్రి మోక్షసాధన రహస్య అంతమైతే, జ్ఞాన యోగి గా అరవిందులు అందమే ఆరాధ్యమని నమ్మి, ప్రతీ పువ్వులో, రేకులో అందాన్ని, ఆధ్యాత్మికతను చూడగల యోగీంద్రులు" అని  వర్ణించారు.ఈ విధంగా, రచయిత ఒక  సమగ్ర అవగాహనను పాఠకులకు అందించారు.

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్:
"రవీంద్రనాథ్ ఠాగూర్ భావన లో మెరిసిన అనంత యవ్వనమే ఊర్వశి", అని శ్రీ వెంకటేశ్వర్లు గారు అభివర్ణించారు." విశ్వాత్మ నుండి విడివడిన జీవుని వేదన,  ఆనందంగా ఆలపించి,స్వర్గ మర్త్య లోకాలను  ఒకటిగా ముడివేసి మానవ లోకాన్ని మహిత దేవలోకం గా తీర్చిదిద్దిన సందర్భంలో మానవ హృదయంలోని రస కాసారం లో ప్రభవించిన మనోహర మూర్తి ఊర్వశి", అని రవీంద్రులు వర్ణించారు."సుఖదుఃఖాలను పంచే విధాత్రి గా ఊర్వశిని రవీంద్రుడు ఊహించారు",అని రచయిత చెప్పుకొచ్చారు
మరొక భారతీయ సాహిత్య ముద్దు బిడ్డ  జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, శ్రీ  రామధారి సింహా దినకర్ అనే కవి.ఈ వ్యాసం పచ్చిపులుసు వెంకటేశ్వర్లు గారు చాలా చక్కని చర్చతో ప్రారంభించారు.       "లేకుంటే, జాతీయ కవిగా  జాతిని స్వాతంత్రోద్యమం వైపు అభిముఖం చేయడానికి కలం అనే  కత్తిపట్టిన కవి, సత్యాగ్రహం గురించి వ్రాసిన కవి, 'ఊర్వశి' గురించి పద్యాలు వ్రాయడం ఏమిటి?", అని ప్రశ్నిస్తూ,
" అగ్ని శిఖలు కురిపించిన కాలమే వసంత పూవులు కూడా చిలకరించింది. వీరం ఉన్నచోట శృంగారం ఉండకూడదని నిషేధం ఏమైనా ఉన్నదా?",  అని రాసుకొచ్చారు.ఇలాంటి చర్చతో ఈ పుస్తకం ఒక వ్యాస సంకలనంగా గాక విశిష్టమైన వచన కావ్యంగా, మనోమయ కోశంలో తార్కిక చింతన కలిగించేదిగా రూపుదిద్దుకుందని చెప్పవచ్చు.
తన  కథలో దినకర్ గారు వ్రాసిన ఒక గొప్ప ఊహ ఏమనగా, స్త్రీ ని గురించి ప్రస్తావిస్తూ," అదృశ్యం నుంచి జగతి లోకి మానవుణ్ణి తెచ్చే మహా సేతువు స్త్రీ",అనీ," దృశ్యాదృశ్యాలను సాకారం చేయగల శక్తి స్త్రీ లదే అనీ, దైవమే స్త్రీ గర్భంలో రూపధారణ చేస్తాడని,  దేశ కాలాలను అధిగమించిన రూపంగా అలౌకిక అనుభూతిగా,ఆత్మ తంత్ర యవ్వన వీణ ప్రభ గా,  భూత భవిష్యత్ వర్తమాన కాలాల విశ్వప్రియ గా ఊర్వశిని, శ్రీ దినకర్ గారు అభివర్ణించారు", అని రచయిత శ్రీ  వెంకటేశ్వర్లు గారు మనోహరమైన వివరాలను పొందుపరిచారు. 

ఆంధ్రమహాభారతం: 
పాశుపతాస్త్రం పొందిన తరువాత దేవేంద్రుని వద్దకు వచ్చిన అర్జునునికి కాముకత ను పరీక్షగా ఇచ్చిన  ఊర్వశి, అతడి చే తిరస్కరింపబడిన కోపం తో శపించినట్టు, భవిష్యత్తులో అదే ఆయనకు వరం గా సంప్రాప్తించిన వైనం తెలియజేయబడింది.

హరివంశం : లో నాచన సోమన నరకాసుర వృత్తాంతానికి ఊర్వశి ఒక పరిష్కారంగా చూపించబడింది.
ఆంధ్ర షెల్లీ శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ఊహలో, ఆరాధన అన్వేషణ, దర్శనం, వియోగం అనే ప్రేమ రూపం గా, శాపం, విషాదంతో మృత్యువును ఆశ్రయించిన నిత్య నిరంతర ఆత్మ భక్తుడైన కవిని గమనించవచ్చు అని రచయిత విశ్లేషించారు. భగవంతుని సాక్షాత్కారమే కాక సామీప్యం,  సాలోక్యం, సాయుజ్యం అనుభవించిన రసికత గల కావ్యం గా ఊర్వశిని శాస్త్రిగారు సృష్టించారు.
ఈ  వ్యాసంలో పచ్చి పులుసు వెంకటేశ్వర్లు గారు ఒక గొప్ప రహస్యాన్ని అందించారు. అదేమిటంటే భక్తుడు ప్రేయసిగా, భగవంతుడు పురుషుడు గా నడిచేది మధురభక్తి. భగవంతుని ప్రేయసిగానూ తనను తాను ప్రియునిగానూ  ఆపాదించుకోవటం సూఫీ  తత్వమనీ , అలా ఊహల రెక్కలతో దివ్యధామ అనుభవసారాన్ని తెలుగు సాహిత్య లోకానికి అందించినది శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అని తెలియజేశారు.
ఈ అబ్జర్వేషన్ వలన రచయిత శ్రీ పచ్చిపులుసు   వేంకటేశ్వర్లు గారు రచయిత లో  సహేతుకంగా మూర్తీభవించిన సహృదయతకు అద్దం పట్టినట్లుగా పాఠకుడు ఆనందిస్తాడు.

 శ్రీ గుడిపాటి వెంకట చలం గారు
అందరూ 'ఊర్వశి' అని పేరు పెడితే 'పురూరవ' అని పేరు పెట్టిన చలంగారి  గురించి, పచ్చి పులుసు వెంకటేశ్వర్లు గారు రాస్తూ, " చలం నాటకాలను ఊరికే ఉబుసుపోక వ్రాయలేదు. పూర్వీకుల సంకుచితత్వాన్ని చెర పట్టటానికి నాటకాలు రాశాడు.కానీ వాటన్నింటిలో 'పురూరవ' నాటకం గొప్ప ప్రత్యేకతను సంతరించుకుంది.", అని విశ్లేషించారు. 
ఊర్వశి అవతరణ మొదలుకొని, చలం గారు రాసిన ప్రతి వాక్యంలోనూ ఉన్న అర్థం,దాగిన పరమార్థం రెంటినీ శ్రీ  వెంకటేశ్వర్లు గారు అభివర్ణించారు . 
"మానవుడి అహంకార నిర్మూలనకు, అతడు ఎంత అల్పుడు వివరించేందుకూ , ఊర్వశిని చలం సృష్టించాడు", అని చెప్పారు.
ఈ అధ్యాయం లో పచ్చి పులుసు వెంకటేశ్వర్లు గారు 1.అహంకార నిర్మూలన 2.ఆనంద శిఖరాలు 3. మానుషత్వం అంటూ అంచెలంచెలుగా చలం గారు, ఎలా కథను ఆవిష్కరించారో,  నాటకంలోని కొన్ని సంభాషణలను ఉదహరిస్తూ వ్రాసిన శైలి అమోఘంగా ఉంది.ఈ వ్యాసం మొత్తం పలుమార్లు చదువుకుని ఆనందించేది గా వ్రాయడంలో రచయిత ప్రత్యేక మైన విశ్లేషణా చాతుర్యం తెలుస్తోంది.మరొక ప్రత్యేక వ్యాసంలో, "ఊర్వశి ముక్తి కాంత ఎందుకు కాకూడదు?" అని చలం గారి 'పురూరవ' నాటకం  నుండి వాక్యాలను ఉదహరిస్తూ ఆమె ఇహలోకం, ఆముష్మిక లోకములకు వంతెన. మానవ లోకం నుంచి స్వర్గలోకానికి నిచ్చెన అని , భవబంధ విమోచనం అని వ్రాసుకొచ్చారు.
శంకరాచార్యుడు తత్వబోధ లో చెప్పిన సాధన చతుష్టయం అనుష్టానం ను  చలం 'పురూరవ'  నాటకంలో ఊర్వశి పాత్రకు అన్వయిస్తూ రచయిత  శ్రీ పచ్చిపులుసు వెంకటేశ్వర్లు గారు చెప్పిన మాటలు అసలు  'ఊర్వశి' అనే పాత్ర ఎలా ఇందరు మహా రచయితలను ప్రభావితం చేసిందో పాఠకులకు తెలుస్తుంది.ఈ రెండు అధ్యాయాలు ఈ పుస్తకానికి  శిరోమణుల వంటివి. 
షడ్రసోపేతమైన భోజనం చేసిన పిమ్మట అరుదైన సుగంధ ద్రవ్యాలతో తాంబూల సేవనం చేసినపుడు సంపూర్ణ ఆనందం దక్కినట్టు,  శ్రీ సంపత్ కుమార్ గారి,' చలం పురూరవ' అనే  మరొక వ్యాసాన్ని కూడా ఇందులో ప్రస్తావించడం నిండుగా ఉంది.
అత్యాధునిక పోకడలతో ఆర్థిక, సామాజిక స్వేచ్ఛను అనుభవిస్తూ, సున్నితత్వం  కోల్పోయి, ఒకానొక మానసిక సంఘర్షణ కు స్త్రీ గురి ఔతోంది. ఈ నేపధ్యంలో 'ఊర్వశి' పాత్ర ఔచిత్యం గురించి, ఆమెకున్న లలిత గంభీర పటిమ గురించి చెప్పడం చాలా బాగుంది. సృజనకారులు, ఊహా శిల్పులు, అయిన మగవారికి  ఊర్వశి ఒక అప్సరస గా మిగిలి పోకూడదు.'అనుబంధ బంధనాల నుంచి దైవత్వం వైపు తోడ్కొని పోయే ముక్తి కాంత' అని పరిచయం చేయబడడం సముచితంగా ఉంది.
ఇలాంటి పుస్తకాలు భావ సమతౌల్యాన్ని పునః ప్రతిష్ఠించే ధ్యేయం కలవి.కనుక వీటిని  పునర్ముద్రణ చేయవలసిన అవసరమూ ఉంది.ఈ సత్యాన్ని గుర్తించిన 'చలం ఫౌండేషన్' వారికి అభినందనలు, కృతజ్ఞతలు . 

డా.కాళ్ళకూరి శైలజ.
కాకినాడ.